ఉద్యోగావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
కోస్గి, వెలుగు: కొడంగల్ నియోజకవర్గంలోని మహిళా అభ్యర్థులకు తిరుపతి సమీపంలోని అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తెలిపారు. మొదటి ఆరు నెలలు శిక్షణ కాలంలో నెలకు రూ.12 వేలు చెల్లిస్తారని, శిక్షణ అనంతరం మహబూబ్నగర్ పట్టణం సమీపంలోని కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సోమవారం కొడంగల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో దరఖాస్తులు అందజేసి ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.
చెక్కు అందజేత
వంగూరు, వెలుగు: మండలంలోని తిప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోకమల్ల ఆంజనేయులు సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపిక కావడంతో ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.లక్ష చెక్కును అందజేశారు. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన ఆంజనేయులును అభినందించారు.
జైపాల్ రెడ్డి పేరు పెట్టడం హర్షణీయం
ఆమనగల్లు, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు దివంగత కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టడం హర్షణీయమని పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేసి సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి ఇది గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
2న పూసల్ పహాడ్ టాలెంట్ టెస్ట్
నారాయణపేట, వెలుగు: జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 2న పూసల్ పహాడ్ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శేర్ కృష్ణారెడ్డి తెలిపారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా టాపర్లకు నగదు బహుమతి, స్కూల్ టాపర్లకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని తెలిపారు.
కాంప్లెక్స్ నిర్మించాలని వినతి
ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్ ఆఫీస్ ఆవరణలో కాంప్లెక్స్ నిర్మించాలని చిరు వ్యాపారులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయనను కలిసి సమస్యను వివరించారు. రోడ్డు విస్తరణతో తమ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి తమను ఆదుకోవాలని కోరారు. అంతకుముందు విద్యానగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. భట్టు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సంజీవ్ యాదవ్, వెంకటేశ్వర్లు గౌడ్, గుర్రం కేశవులు పాల్గొన్నారు.
సీపీఐతోనే సమస్యలు పరిష్కారం
వనపర్తి టౌన్, వెలుగు: కష్ట జీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని సీపీఐ పట్టణ కార్యదర్శి జె.రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం పట్టణంలో సీపీఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భగత్ సింగ్ నగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతో ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. సీపీఐతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కిష్టయ్య, కళావతమ్మ, లక్ష్మీనారాయణ, చిన్న కురుమన్న, జయమ్మ, శిరీష, జ్యోతి, రవి పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
కల్వకుర్తి, వెలుగు : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కల్వకుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పండిత్ రావ్ సూచించారు. ఆదివారం మార్కెట్ యార్డులో వేరుశనగ కొనుగోళ్లను పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని వ్యాపారులకు సూచించారు. మార్కెట్కు వచ్చే రైతులకు సౌలతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. మార్కెట్ సెక్రటరీ భగవంత్, సూపరువైజర్లు శ్రీధర్, విజయభాస్కర్ పాల్గొన్నారు.